: పార్లమెంటులో తెలంగాణ బిల్లు కూడా పెట్టలేకపోయింది కాంగ్రెస్: సుష్మ
ఇప్పటిదాకా తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందని లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ విమర్శించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను పొడిగించినప్పటికీ... కనీసం తెలంగాణ బిల్లును కూడా పెట్టలేకపోయారని అన్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లు పెడితే రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయేదని తెలిపారు. ఎన్డీఏ హయాంలో జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఎలాంటి ఆందోళనలు లేకుండా ఏర్పాటు చేశామని... తెలంగాణ విషయంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిందని విమర్శించారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనయినా తొలిరోజే తెలంగాణ బిల్లు పెట్టాలని ఈ బీజేపీ అగ్రనేత కోరారు.