: 2020 ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వనున్న టోక్యో


జపాన్ రాజధాని టోక్యో మరోసారి ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను కైవసం చేసుకుంది. 1964లో ఓసారి ఈ ప్రపంచ అతిపెద్ద క్రీడా సంరంభానికి ఆతిథ్యమిచ్చిన టోక్యో సిటీ మరోసారి ఈ మెగా ఈవెంట్ కు వేదికగా నిలుస్తోంది. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో టోక్యో నగరం ఇస్తాంబుల్, మాడ్రిడ్ లను వెనక్కినెట్టి 2020 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఓటింగ్ లో టోక్యోకు 60, ఇస్తాంబుల్ కు 36 మంది మద్దతిచ్చారు. కాగా, 2016 ఒలింపిక్ గేమ్స్ ను బ్రెజిల్ నగరం రియో డి జనీరో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అప్పటి ఓటింగ్ లో టోక్యో మూడోస్థానంతో సరిపెట్టుకుంది.

కాగా, జపాన్ కు ఒలింపిక్ ఆతిథ్యం దక్కడంపై ఆ దేశంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఐఓసీ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల్లో కొన్ని జపాన్ లోని ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రంలో రేడియేషన్ వెలువడుతోందంటూ ఆందోళన వెలిబుచ్చాయి. అయినాగానీ, టోక్యో ఈ వ్యతిరేకతను సైతం అధిగమించి ఒలింపిక్స్ చాన్స్ దక్కించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News