: అమెరికాలో ఇద్దరు సిక్కుల హత్య
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎల్హర్ట్ నగరంలో ఇద్దరు సిక్కులు దారుణ హత్యకు గురయ్యారు. వీరిని పంజాబ్ లోని జలంధర్ ప్రీత్ నగర్ కు చెందిన జగత్తర్ సింగ్ భట్(55) గాను, హోషియార్ పూర్ లోని మున్నన్ గ్రామానికి చెందిన పవన్ ప్రీత్ సింగ్(20) గా గుర్తించారు. తాజా ఘటనపై సిక్కు సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గత రాత్రి ఎన్నారై జగత్తర్ సింగ్ కు చెందిన డిపార్ట్ మెంటల్ స్టోర్సు దగ్గరకు వచ్చిన గుర్తుతెలియని అగంతకులు ముసుగులు ధరించి వచ్చి అతనిని, అతని షాపులో పని చేస్తున్న పవన్ ప్రీత్ సింగ్ ను కాల్చి చంపారు.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో ప్రత్యక్ష సాక్షుల వివరాలతో కెవిన్ మూర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వీరి మృతికి సంతాప సూచకంగా సిక్కులంతా కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. దీనిపై అమెరికాలో సిక్కులపై అరాచకాలు పెరిగిపోతున్నాయని, దేశంలో సిక్కులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఉత్తర అమెరికా పంజాబి అసోసియేషన్ కార్యనిర్వాహక డైరెక్టర్ సత్నం సింగ్ దేశాధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశారు.