: చర్మకేన్సర్‌కు కొత్త చికిత్స
చర్మకేన్సర్‌ను నివారించేందుకు పరిశోధకులు ఒక కొత్త తరహా చికిత్సను రూపొందించారు. శరీరం లోపలే జరిగే ఈ చికిత్సతో చర్మకేన్సర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అమెరికా హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆధ్వర్యంలో చర్మ కేన్సర్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక చికిత్సా విధానాన్ని వైద్య నిపుణులు అభివృద్ది పరిచారు. ఈ విధానంలో భాగంగా వేలిగోరు అంత సైజులో ఉండే స్పాంజ్‌ను కేన్సర్ బాధితుడి చర్మం కింద ప్రవేశపెడతారు. ఇది చూడడానికి స్పాంజ్‌లాగే ఉన్నా, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి కేన్సర్ కణాలను ధ్వంసం చేసే సామర్ధ్యం ఉంటుంది.
స్పాంజ్‌లో ఉండే యాంటీజెన్లు శరీరంలోని కేన్సర్ కణితులను గుర్తిస్తాయి. స్పాంజ్‌నుండి విడుదలయ్యే ప్రోటీన్, రోగనిరోధక వ్యవస్థ కణాలను తన వైపునకు ఆకర్షించి వాటిని బలోపేతం చేసి కేన్సర్ కణితుల దిశగా పంపిస్తుంది. ఈ విధంగా చర్మకేన్సర్‌ను బయటినుండి కాకుండా శరీరం లోపలినుండే నిర్మూలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ ఎలుకల్లో ఈ విధానం విజయవంతం కావడంతో ప్రస్తుతం దీన్ని కేన్సర్ బాధితుల్లో పరీక్షిస్తున్నారు.