: అప్పుడు అవయవాలను ప్రింటర్‌నుండి తీసుకోవచ్చు!
మన శరీరానికి ఏదైనా అవయవం కావాల్సి వస్తే... దాతకోసం ఎదురుచూస్తుంటాం... అయితే ఇలా దాతకోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా... మన శరీరానికి అవసరమైన అవయవం కొలతను ఇస్తే... దానికి అనుగుణమైన అవయవాన్ని ప్రింటర్‌నుండి చక్కగా ప్రింట్ తీసి ఇస్తారట... ఈ ప్రింటెడ్ అవయవాన్ని మన శరీరానికి చక్కగా వినియోగించుకోవచ్చట... ఇలాంటి ఒక సరికొత్త ప్రింటర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించే ప్రక్రియలో ఉన్నారు.
మెల్‌బోర్న్ టీటీపీ అనే సంస్థ ఒక కొత్త తరహా పరికరాన్ని రూపొందించింది. ఇది విస్టా 3డీ అనే నాజిల్ పరికరం. దీనితో మన శరీరానికి అవసరమైన అవయవాన్ని ప్రింట్ తీసి మన శరీరానికి ఉపయోగించుకోవచ్చని నిపుణులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన శరీరానికి కావాల్సిన అవయవానికి సంబంధించిన కొలతలు, అందులో ఉండాల్సిన పదార్ధాలు, కణాలను ఈ ప్రింటర్‌కు ఇస్తే... అది చక్కగా మనకు అవసరమైన ఒక అవయవాన్ని తయారుచేసి ఇస్తుంది... వచ్చే పదేళ్లకు ఇది కచ్చితంగా సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్ధిష్టమైన కణాలను సరైన స్థితిలో ఉంచి, వాటి స్థితికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రింటర్‌కు పంపించగలిగితే దేన్నైనా 3డీ ప్రింట్ తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. విస్టా 3డీ ఈ పని కచ్చితంగా చేయగలుగుతోందని మెల్‌బోర్న్ టీటీపీ సంస్థ ఎండీ హయద్ నమ్మకంగా చెబుతున్నారు.