: వ్యాయామంతో మేలెంతో
వ్యాయామంతో ఎంతో మేలు కలుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయినా మరోసారి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాయామం చేసే వారిలో యువకులుగా ఉన్న సమయంలో చేసే వ్యాయామం వారిలో వయసు మీరిన తర్వాత మూర్ఛ వ్యాధికి సంబంధించిన ముప్పును తగ్గిస్తుందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.
స్వీడన్లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో యువకులుగా ఉన్నప్పుడు బాగా వ్యాయామం చేసిన పురుషులకు వయసు మీరిన తర్వాత మూర్ఛ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతున్నట్టు తేలింది. యవ్వనంలో వ్యాయామం ద్వారా శారీరక సామర్ధ్యాన్ని మెరుగుపరచుకున్న వారికి, శారీరక సామర్ధ్యం అంతగా లేనివారితో పోల్చుకుంటే ఈ వ్యాధి వచ్చే ప్రమాదం 79 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది.
ఈ విషయాన్ని గురించి గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎలినార్ బెన్-మెనాచెమ్ మాట్లాడుతూ వ్యాయామం మూర్ఛ ముప్పును దూరం చేస్తుందని తేలడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ విషయంలో వ్యాయామం రెండు రకాలుగా పనిచేస్తుండొచ్చని, ఇది మెదడును కాపాడుతూ ఉండవచ్చని, అలాగే దాన్ని మరింత బలోపేతం చేస్తుండవచ్చని, లేదా చిన్న వయసులో శారీరకంగా దృఢంగా ఉన్నవారు మలివయసులో కూడా తగినంత సామర్ధ్యంతో ఉండటం కూడా మూర్ఛ వ్యాధి ముప్పును దూరంగా ఉంచడానికి దోహదం చేస్తుండవచ్చని ఎలినార్ అన్నారు.