: ఏరుదాటాక తెప్ప తగలేస్తున్న కాంగ్రెస్ పార్టీ: బాబు
రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్ర ప్రజలను పూచికపుల్లల్లా తీసేసి ఏరుదాటాక తెప్పతగలేసినట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన పార్టీ అన్నారు. చదువూ సంధ్యల్లేని సోనియాగాంధీయా విభజన చేసేది అని ఎద్దేవా చేశారు. ఇక్కడికొచ్చి పరిస్థితులను అధ్యయనం చేయకుండా, ఏ ప్రాతిపదికన, పంపకాలు ఏ విధంగా చేస్తారో చెప్పకుండా ఢిల్లీలో కూర్చుని, పార్లమెంటులోంచి విభజన అంటే ఎలా అని ప్రశ్నించారు.
గతంలో వారి పార్టీ నుంచి సమైక్య విధానాన్ని అమలు చేసిన ఇందిరా గాంధీని అవమానిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ముందుండి నడిపించాల్సిన ప్రధాని మన్మోహన్ సింగ్ తోలు బొమ్మమాదిరిగా తయారయ్యాడని విమర్శించారు. 'తా దూర సందు లేదు మెడకో డోలు' అన్నట్టు దిగ్విజయ్ తానేం చేస్తున్నాడో తనకే తెలియడంలేదని మండిపడ్డారు. ఆర్థికమంత్రిగా చిదంబరం వల్ల ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని అలాంటి వ్యక్తి విభజన నిర్ణయం ఎలా తీసుకుంటాడని అడిగారు.
అహ్మద్ పటేల్ కి తన రాష్ట్రం గురించే నిండార తెలీదు కానీ విభజన గురించి మాత్రం తెలుసంటున్నారు, అది ఎలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నేతలకు ఆంధ్రప్రదేశ్ పై అవగాహనే లేదు, అలాంటిది విభజించే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. దేశంలో, రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని గుర్తు చేశారు. ఫలితంగా ధరలు పెరిగాయని ఆరోపించారు. ఉల్లి తరిగితే కళ్లలో నీరు తిరిగేదని, కానీ, తలచుకుంటేనే ఇప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వంట గ్యాస్ సిలెండర్లపై కోత విధించారని బాబు అన్నారు. రైతులు తమ సరకు నిల్వ ఉంచుకోడానికి టీడీపీ ప్రభుత్వం గోడౌన్లు కట్టించిందని అన్నారు. తాము అధికారంలో ఉండగా పనికి ఆహార పథకం కింద బియ్యమిచ్చానని గుర్తు చేశారు. కాంగ్రెస్ కష్టాలు తీరుస్తుందని అధికారం కట్టబెడితే ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. తనకు అధికార దాహం లేదని ప్రజల దయవల్ల తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నానని సంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లాంటి సిటీని తొమ్మిదేళ్లలో సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేశానని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ ను అందరి కోసం అభివృద్ధి చేశానని అన్నారు. కేంద్రప్రభుత్వం, నేతలు బంగారం మీద మోజుతగ్గించుకోండని చెబుతున్నారని, వీళ్లకి పాలన చేతకాక ప్రజల్ని వేడుకుంటున్నారని ఆక్షేపించారు. టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయం చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
అందుకే విభజన పేరిట కుట్ర చేశారని అన్నారు. సోనియా కొడుకు మొద్దబ్బాయి, విజయమ్మ కొడుకు దొంగబ్బాయి అని అభివర్ణిస్తూ.. వీరి కోసం తెలుగు జాతిని నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నారని దాన్ని అడ్డుకోవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని, అవన్నీ పట్టించుకోకుండా విభజనే కావాల్సి వచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.