: జి20 సమావేశానికి బయల్దేరి వెళ్లిన ప్రధాని
జి20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో ఎన్నో అంశాలు చర్చకు రానున్నాయి. అమెరికాలో ఆర్థిక ఉద్ధీపనల ఉపసంహరణకు నిర్ణయం తీసుకోవడంతో దీని ప్రభావం నుంచి బయటపడేందుకు ఇతర వర్ధమాన దేశాలతో కలిసి సహకారాత్మక కార్యాచరణపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాలోచనలు జరపనున్నారు. వర్ధమాన దేశాలు నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో డాలర్ బలపడుతుండగా.. ఆయా దేశాల కరెన్సీల విలువ హరించుకుపోతోంది. ఈ అంశం ప్రత్యేకంగా బ్రిక్స్ దేశాల మధ్య చర్చకు రానుంది. ఈ సమావేశంలోనే ప్రధాని బ్రిక్స్ దేశాలతో కూడా సమావేశం కానున్నారు.
కాగా, అమెరికా.. సిరియాపై సైనిక చర్యకు సిద్ధమవుతుందంటూ వస్తున్న వార్తలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తాయి. 2008లో తొలిసారిగా జి20 సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన అన్ని సదస్సులలోనూ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ప్రధాని శనివారం తిరిగి భారత్ కు వస్తారు.