: ఆన్లైన్ వల్లే చెడిపోతున్నారట!
తమ పిల్లలు ఎలాంటి చెడు అలవాట్లకు గురికాకుండా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే అసలు పిల్లలు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు? అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఏం చేస్తున్నారు... ఏం చూస్తున్నారు? అనే విషయాన్ని గమనిస్తే వారు చెడు అలవాట్లకు గురికాకుండా చూడవచ్చట. ఎందుకంటే యువత ఎక్కువగా ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో వారు చూసే చెడు ఫోటోలు వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టు శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన థామస్ వాలెంటే బృందం టీనేజర్ల అలవాట్లపై సామాజిక సైట్ల ప్రభావం ఎలా ఉంది? అనే విషయంపై పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధనలో భాగంగా వీరు 12 నుండి 17 ఏళ్ల పాఠశాల విద్యార్ధులతో మాట్లాడారు. వారిలో 95 శాతం మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. వీరిలో 80 శాతం మంది ఫేస్బుక్, మైస్పేస్, ట్విట్టర్ వంటి సామాజిక సైట్లలో స్నేహితులను కలిగివున్నారు. వీరిలో 20 శాతం మంది పొగతాగుతూ, మద్యం తాగుతూ తీయించుకున్న ఫోటోలను ఈ సైట్లలో పోస్ట్ చేస్తున్నారట. ఇలా స్టైలిష్గా వారు తీయించుకున్న ఫోటోలను చూసి చాలామంది ప్రభావితులవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఫోటోలను చూసి తాము కూడా అలా ఉండాలని చాలామంది తహతహలాడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీరి అధ్యయనంలో పాలుపంచుకున్న 34 శాతం మంది ఇలాంటి సైట్లలో చూసిన ఫోటోలకు ప్రభావితులై పార్టీ చేసుకుందామని, బాగా ఎంజాయ్ చేద్దామని ఆన్లైన్లో మాట్లాడుకుంటున్నారట. ఇలాంటి ఫోటోలను చూసిన 30 శాతం మంది పొగతాగడానికి అలవాటుపడగా, సగంమంది ఏదో ఒక సందర్భంలో మందు తీసుకున్నవారేనని ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు... ఏం చూస్తున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించుకుంటే వారిని చెడు అలవాట్ల బారినుండి కాస్త కాపాడుకోవచ్చు.