: నింగి అధ్యయనంతో నేలను గమనించవచ్చు!
ఆకాశం నుండి చూస్తూ... నేలపై ఏం జరుగుతుంది అనే విషయాన్ని పసిగట్టగలమా... సాధ్యం కాదు అని మనం అనుకుంటాం. అయితే ఆకాశంనుండి చూస్తూ చక్కగా అధ్యయనం చేయడం ద్వారా నేలపై వచ్చే ఉపద్రవాలను పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో సెన్సర్లు అమర్చిన ప్రత్యేక విమానాల ద్వారా భూమి ఆకృతిలో వచ్చే మార్పులను గమనించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు విమానాల్లో ప్రత్యేక సెన్సర్లు అమర్చి వాటి ద్వారా భూమి ఫలకాలు కదలడం వల్ల మారుతున్న నేల ఆకృతిని గుర్తించవచ్చని వివరించారు. ఈ సెన్సర్లు అందించిన డేటాను ఉపయోగించి, కాలిఫోర్నియాలోని శాన్ డ్రాగన్స్ ఫాల్ట్‌పై పడిన ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిలోని ఫలకాల కదలికల వల్ల డ్రాగన్స్ బ్యాక్ అనే పర్వతపంక్తి వద్ద నేలలో మార్పులు జరిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలాంటి కదలికలకు సాధారణంగా భూకంపాలతో సంబంధం ఉంటుంది. రెండు ఫలకాల సరిహద్దుల్లో ఈ విపత్తు సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి ఉపరితలానికి సంబంధించి ఇలా గగనతలంనుండి అధ్యయనం చేయడం ద్వారా భూకంపాలు, కొండ చరియలు విరిగిపడడం వంటి వాటిని ముందుగానే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.