: విశాఖలో 'ఖాకీ'చకులు.. సాయం చేస్తామని అత్యాచారం
ఖాకీలూ కీచకావతారమెత్తుతున్నారు. రక్షణ కల్పిస్తామని, భద్రతకు భరోసా ఇస్తున్నామని ఉపన్యాసాలు దంచే ఖాకీ బాసులు విశాఖ ఘటనపై ఏం సమాధానం చెబుతారో చూడాలి. పోలీస్ స్టేషన్ అంటేనే భయం... స్టేషన్ కు ఫిర్యాదు కోసం వస్తేనే నేరం అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరువుగల కుటుంబాలు పోలీస్ స్టేషన్ గడప తొక్కడమే పాపమన్న ఆలోచన చాలా ప్రాంతాల్లో ఉంది. అదీకాక ఒకసారి పోలీసు స్టేషన్ గడప తొక్కితే తరువాత తలనొప్పి అని.. పోలీసుల ప్రవర్తన మంచిది కాదని ఇలా చాలా వాదనలు వ్యాప్తిలో ఉన్నాయి.
తాజాగా విశాఖపట్టణంలో జరిగిన ఖాకీచకపర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ అమాయకురాలిని బెదిరించి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. విశాఖ జిల్లా పెందూర్తి మండలం కొట్నివానిపాలెంకు చెందిన ఓ వ్యక్తి బంగారం చోరీ కేసులో ఈ ఏడాది జూలై 8 నుంచి రిమాండులో ఉన్నాడు. అతని భార్య ములాఖత్ కోసం పలు మార్లు జైలుకు వచ్చేది. జైలు దగ్గర విధులు నిర్వర్తించే రూరల్ కానిస్టేబుల్ జేవీవీ వర్మ, నగర కానిస్టేబుల్ అఖిల్ అలియాస్ ప్రవీణ్ ఆమెపై కన్నేశారు.
నిందితుడిని విడుదల చేయిస్తామని ప్రలోభపెట్టి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె ఇంటికి కూడా వెళ్లి బెదిరించి లోబర్చుకున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె మంచంపట్టింది. ఇటీవలే బెయిల్ పై విడుదలైన ఆమె భర్త విషయం తెలుసుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.