: సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం.. రెండు రోజులు ఆగుతాం: గంటా
తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన రోజే రాజీనామాలు చేశామని అన్నారు. ఈ రోజు గవర్నర్ కు తమ రాజీనామాలు సమర్పించామని, అయితే ఆయన ముఖ్యమంత్రి ఆమోదించిన తరువాతే తాను ఆమోదిస్తానని స్పష్టం చేసినట్టు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రిని కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరినట్టు తెలిపారు. దానికి ముఖ్యమంత్రి మరో రెండు రోజుల్లో తాను ఢిల్లీ వెళుతున్నానని, ఇప్పటివరకు అందరం కలిసే ప్రయాణించాం, ఇకపై కూడా అలాగే ప్రయాణిద్దామని ఆయన అన్నారని గంటా తెలిపారు.
కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ ఒక ప్రాంతం అభిప్రాయాన్ని ప్రతిబింబించలేమని, అది నైతికత కాదని, అందుకే రాజీనామాలు ఆమోదించాలని కోరామని గంటా తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని గంటా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పడంతో తమ రాజీనామాలపై మరో రెండు రోజులు వేచిచూస్తామని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని గంటా తెలిపారు.