: బాబుది సమైక్యవాదమా? వేర్పాటు వాదమా? స్పష్టం చేయాలి: లగడపాటి
పార్లమెంటులో సస్పెండైన అనంతరం ఎంపీ లగడపాటి పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రపై స్పందిస్తూ.. ప్రతి పార్టీకి క్యాడర్ ఉంటుందని, వారే యాత్రల్లో కన్పిస్తారని అన్నారు. అయితే ప్రజల గుండెల్లో ఏముందో అది గుర్తించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లే ముందు తాను సమైక్యవాదో? లేక, వేర్పాటు వాదో? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి ఎలాంటి వేషాలతో వెళ్లినా నిజానిజాలు గ్రహించే ప్రజలు ఎవరికి బుద్ధిచెబుతారో చూడాలని అన్నారు. ప్రజలు మీటింగులకి వస్తున్నారని ఉబలాటపడితే అసలుకే మోసం వస్తుందని గ్రహించాలని ఆయన సూచించారు. ఎవరి పోరాటం ప్రజలకు లబ్ది చేకూరుస్తుందో వారికి తెలుసని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.