: సల్మాన్ నివాసం ఎదుట తల్లీకూతుళ్ళ హల్ చల్
ముంబయ్, బాంద్రాలోని సల్మాన్ ఇంటి ముందు రాత్రివేళ ఇద్దరు మహిళలు హల్ చల్ చేశారు. ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులుగా చెప్పుకుంటున్న జాస్మిత్ సేథి, అమ్రిత అనే తల్లీకూతుళ్లు రాత్రి తొమ్మిది గంటల సమయంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్దకు వచ్చారు. తమను లోపలకి వెళ్లనివ్వాలని కోరుతూ భద్రతా సిబ్బందితో గొడవకు దిగారు. అమ్రిత హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సినిమాలో సల్మాన్ ఖాన్ ను ఒక పాటలో నటింపచేయాలని వారిద్దరూ భావించారు. అయితే సల్మాన్ ఖాన్ ను కలవాలంటే పది లక్షలు చెల్లించాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శి రేష్మా శెట్టి డిమాండ్ చేశారని అమ్రిత ఆరోపించారు.
వారి గొడవ జరుగుతుండగానే రక్షణ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల్ని చూడగానే తల్లీ కూతుళ్లిద్దరూ తమ కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతివేగంగా వాహనం నడుపుతూ పోలీసుల బైక్ తో పాటు మరో వ్యక్తి బైక్ నూ స్వల్పంగా ఢీకొట్టారు. మరోవైపు అమ్రిత ఆరోపణల్ని రేష్మా శెట్టితో పాటు సల్మాన్ తండ్రి సలీమ్ ఖండించారు. మూడు రోజులుగా ఆ మహిళలు తమను వేధిస్తున్నారని సలీమ్ ఖాన్ ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళలను బాంద్రా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, రాత్రివేళ మహిళలను అరెస్టు చేయకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా వారి వివరాలను తీసుకుని పంపించి వేశారు. తీరా మర్నాడు ఉదయం వారిచ్చిన చిరునామా వడ్డుకు వెళితే ఆ మహిళలు అప్పటికే అక్కడి నుంచి ఉడాయించారు!