: భార్య విజయం ఈగోను దెబ్బతీస్తుందిట!
తాను విఫలమైన రంగాల్లో తన భార్య, లేదా గాళ్‌ఫ్రెండ్ సక్సెస్ సాధించడం అనేది.. మగాడి ఈగోను దారుణంగా దెబ్బతీస్తుందిట. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ విషయం తేల్చడానికి పెద్దగా పరిశోధనలు అక్కర్లేదు. కానీ శాస్త్రవేత్తలు సాధికారికంగా తేల్చిచెప్పారు. అది పురుషుల్లో ఇన్ఫీరియారిటీని కూడా పెంచుతుందిట. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఈ విషయమై ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. ప్రత్యేకించి తాము విఫలమైన రంగాల్లో భార్యలు విజయం సాధిస్తే.. పురుషులు దానిని ఒక పట్టాన తట్టుకోలేరుట.
అయితే మహిళల విషయంలో ఈ తరహా స్పందన నిజం కాదని అదే అధ్యయనం చెప్తోంది. మహిళలు మాత్రం తమ భర్త ఎక్కువ సక్సెస్ సాధించినప్పుడు చాలా అదనపు ఆనందాన్ని ఫీలవుతున్నారట.
వ్యక్తిత్వం మరియు సాంఘిక సైకాలజీ అనే అంశాలపై 896 మందిపై పరిశోధనలు చేసి ఫలితాల్ని ప్రచురించారు. భార్యల విజయం సందర్భాల్లో పురుషుల ఆత్మవిశ్వాసం కనిష్ఠ స్థాయికి పడిపోతుందని తేలింది. ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన కేట్ రాట్లిఫ్ దీనికి నేతృత్వం వహించారు. చూడబోతే భార్య తనను ఇక లెక్కపెట్టదేమో అనే ఆందోళన వీరిలో ఉన్నట్లు ఆయన చెప్పారు.