: మీ ఆయుష్షుకు అందుకోండి 'బోనస్ సిక్స్‌టీన్'
స్వీట్ సిక్స్‌టీన్ అనే పదం మనకు చాలా బాగా అలవాటే! జీవితంలో తొలి పదహారేళ్ల ప్రాయాన్నే మనం లెక్కవేస్తూ ఉంటాము. అయితే సాధారణంగా మనం జీవించగల వయో పరిమాణం కంటె అదనంగా మరో 16 ఏళ్లు కలిసి వచ్చాయనుకోండి. మన జీవన ప్రమాణం 80 అనుకుంటే.. 96 వరకు జీవించే ఛాన్సు వచ్చిందనుకోండి.. అసలైన స్వీట్ సిక్స్‌టీన్ అంటే అదీ..!
శరీరంలో చిన్న చిన్న జన్యు మార్పులు చేయడం ద్వారా మనిషి మరింత ఎక్కువ కాలం జీవించేలా చేయడం సాధ్యం అవుతుందిట. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన పరిశోధకులు కనిపెట్టారు. ఈ తరహా పరిశోధనలు చిట్టెలుకపై చేసి చూసినప్పుడు దానికి 20 శాతం ఆయు:ప్రమాణం పెరిగినట్లు వారు గుర్తించారు. మనుషుల్లో గనుక ఇది విజయవంతం అయితే.. జీవితకాలం కనీసం 16 ఏళ్లు ఎక్కువ అవుతుంది.
ఎలుకల్లో జీవక్రియకు కారణమైన ఎంటీఓఆర్ అనే జీన్స్‌పై ప్రయోగాలతో వారు దీనిని సాధించారు. 5 నెలలు ఎక్కువ బతకడమే కాకుండా, వృద్ధాప్యంలోనూ ఇవి ఎక్కువ చురుగ్గానే ఉన్నాయిట. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా గుర్తించి వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
మామూలు జీవితకాలం కంటె కాస్త ఎక్కువ జీవించడానికి మనిషి ఎన్నెన్ని లక్షల, కోట్ల రూపాయలు తగలేయడానికైనా సిద్ధంగా వుంటాడు. అలాంటి కేటగిరీలోని వారికి ఇలాంటి పరిశోధన మరింత స్వీట్‌గా అనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.