: పిల్లలకోసం ప్రత్యేకమైన సాక్సు
మీ పిల్లల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి మీరు చాలా ఆత్రుత పడుతుంటారు. పిల్లలు ఎలా ఉన్నారు... వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా? అనేది మీకు చాలా ఆత్రుత కలిగించే అంశం. కానీ నోరు తెరచి తమకున్న అనారోగ్యాన్ని చెప్పలేని పిల్లలు తమకేదైనా ఇబ్బంది కలిగితే ఏడవడం తప్ప మరోటి చేయలేరు. దీంతో పిల్లలు ఏడిస్తే బెంబేలు పడిపోయే తల్లిదండ్రులకోసం ఒక కొత్తరకం సాక్సులను తయారు చేశారు. ఈ సాక్సులను మీ పిల్లలకు తొడిగితే ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సాక్సు మీ పిల్లల ప్రాణాధారమైన సంకేతాలను మీ స్మార్ట్ ఫోన్కు మెసేజ్ రూపంలో పంపుతాయట. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా... లేదా ఏదైనా సమస్యతో సతమతమవుతున్నారా... అనేది మీరు ఇట్టే గ్రహించవచ్చని ఈ సాక్సు ఉత్తత్తిదారులు చెబుతున్నారు.
అమెరికాలోని చిన్నారుల వస్తువులను ఉత్పత్తిచేసే సంస్థ ఒకటి స్మార్ట్ సాక్స్ను తయారు చేసింది. ఈ సాక్స్ను మీ చిన్నారికి తొడిగితే చాలు ఇక వారి హృదయ స్పందన, ఆక్సిజన్ సరఫరా వంటి పలు అంశాలను గురించి మీ స్మార్ట్ ఫోన్ నుండే మీరు తెలుసుకోవచ్చట. మీ పిల్లలు పడుకున్నప్పటికీ ఈ సాక్స్ వారికి సంబంధించిన ప్రాణాధారమైన సంకేతాలను మీ ఫోనుకు చేరవేస్తుంది. మీ పిల్లల హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయి, చర్మపు ఉష్ణోగ్రత, నిద్ర ఎలా పోతోంది, ఏవిధంగా పడుకుంది వంటి పలు విషయాలను మీ స్మార్ట్ ఫోన్కు ఈ స్మార్ట్ సాక్స్ మెసేజ్ల రూపంలో పంపుతుందట. దీంతో ఇక మీ పిల్లల గురించి మీరు నిశ్చింతగా ఉండవచ్చని కంపెనీ వారు చెబుతున్నారు.