: పోదాం పోదాం పైపైకి...


పోదాం పోదాం పైపైకి అంటూ పాడుకుంటూ ఎంచక్కా 202వ అంతస్థులోకి వెళ్లి చక్కటి కాఫీ తాగుతుంటే ఎలా ఉంటుంది... అసలు అన్ని అంతస్థులు ఎక్కడున్నాయి... అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు... ఇప్పుడు లేవుగానీ... కొద్ది రోజులకు వస్తాయి... అప్పుడు అంత ఎత్తులో... మేఘాలను చూస్తూ... కాఫీ తాగుతుంటే ఎలా ఉంటుంది... సరిగ్గా అలాంటి అనుభవం రావాలంటే చైనాలో నిర్మించతలపెట్టిన కొత్త భవంతి పూర్తి కావాలి. అప్పుడు మీరు అంత ఎత్తైన అంతస్థులోకి వెళ్లి కాఫీ తాగి... అలాంటి అనుభూతిని పొందవచ్చు.

ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా బూర్జ్‌ఖలీఫా భవంతి ఉంది. 162 అంతస్థులతో ఆకాశానికి నిచ్చెన వేశారా... అన్నట్టుగా ఆ భవంతి ఉంటుంది. అయితే ఇంతకన్నా పెద్ద భవంతిని నిర్మించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. చైనాలోని బోర్డ్‌ గ్రూప్‌ కంపెనీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారా... అన్నట్టుగా చైనా ఒక ఆకాశ హార్మ్యాన్ని నిర్మించతలపెట్టింది. కొన్నాళ్ల క్రిందటిదాకా... ప్రపంచంలోనే ఎత్తైన భవంతిగా 101 అంతస్థుల తైపీలోని భవంతి పెద్దదిగా ఉండగా... తర్వాత దాని స్థానాన్ని 162 అంతస్థుల బుర్జ్‌ఖలీఫా భవంతి ఆక్రమించుకుంది. ఇప్పుడు బుర్జ్‌ఖలీఫా భవంతి స్థానాన్ని ఈ కొత్త భవంతి ఆక్రమించనుంది.

ఈ పెద్ద భవంతి పేరు స్కైసిటీ. ఈ పేరులోనే అందం దాగివుంది. ఆకాశాన్ని తాకేలా నిర్మించనున్న ఈ భవంతికి ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ భవనాన్ని చాంగ్‌షా అనే నగరంలో నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణానికి అన్ని అనుమతులూ రావడంతో వచ్చే నాలుగు నెలల్లో దీని నిర్మాణ పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ భవనాన్ని ప్రారంభించాలని బోర్డు గ్రూప్‌ కంపెనీ భావిస్తోంది. ఇది బుర్జ్‌ ఖలీఫాకన్నా 33 అడుగుల ఎత్తు, 39 అంతస్థులు ఎక్కువగా ఉంటుంది. ఇందులో పలు అపార్ట్‌మెంట్‌లు, పాఠశాలలు, హోటెళ్లు, కాఫీషాపులు, రెస్టారెంటులు ఇలా పలు రకాల నిర్మాణాలను ఇందులో చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News