: త్వరలో భత్కల్, తబ్రేజ్ లను ప్రశ్నిస్తాం: అనురాగ్ శర్మ
హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్ అలియాస్ అసదుల్లాలను ప్రశ్నిస్తామని హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఎన్ఐఏ తో కలిసి కేసు విచారణను పూర్తి చేస్తామని తెలిపారు. పేలుళ్ల సమయంలో అక్కడి సీసీ కెమెరాలో భత్కల్ దృశ్యాలు రికార్డయ్యాయన్నారు. భత్కల్, తబ్రేజ్ అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామన్నారు. రాష్ట్ర పోలీసు బృందాలను బీహార్ కు పంపుతామని కమిషనర్ చెప్పారు. అవసరమైతే పీటీ వారెంటుతో వారిని హైదరాబాదుకు తీసుకొస్తామని వివరించారు. నిన్న రాత్రి అరెస్టయిన వీరిద్దరూ ప్రస్తుతం బీహార్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాదుకు తీసుకురానున్నట్లు సమాచారం.