: ప్రాణం పోయే ముందు అవయవదానం చేసిన యువకుడు
ప్రాణం పోతున్న చివరి క్షణంలోనూ ఆ యువకుడిలో మానవత్వం పరిమళించింది. ఆసుపత్రిలో మరణ పోరాటం చేస్తూ 'నా అవయవాలు తీసుకుని మరికొందరికి జీవితాన్ని ఇవ్వండి డాక్టర్' అని ఆవేదనగా చెబుతూ ఆ యువకుడు కన్నుమూయడం చూసిన వైద్యుల కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. ఇది కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. 19 ఏళ్ల మోబిన్ బైక్ పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోబిన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్ళిపోగా, స్థానికులు మోబిన్ ను మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రక్తమోడుతున్న మోబిన్ కు వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేశారు. ఆ తర్వాత మోబిన్ స్పృహలోకి వచ్చాడు. ఇక బతకడం అసాధ్యం అని భావించాడేమో.. తన అవయవాలను వేరొకరికి దానం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి తుదిశ్వాస విడిచాడు. విషాదకరమేమిటంటే, తీవ్ర గాయాల కారణంగా మోబిన్ కళ్లు తప్ప మిగతా అవయవాలన్నీ దానానికి పనికిరాకుండా పోయాయి. ఇదే వైద్యులనూ కదిలించింది. మోబిన్ స్థానికంగా కేటరింగ్ పని చేసుకుంటూ పారిశ్రామిక శిక్షణా సంస్థలో చదువుకుంటున్నాడు.