: 2021లో నాసా గ్రహశకల యాత్ర


నాసా 2021లో గ్రహశకల యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక గ్రహశకలాన్ని చంద్రుని కక్ష్యలోకి చేరవేసే ప్రయత్నాలు ప్రారంభించనుంది. ఇలా గ్రహశకలాన్ని చంద్రుని కక్ష్యలోకి చేరవేయడానికిగాను సుమారు రెండున్నరేళ్లుగా నిద్రాణ స్థితిలో ఉన్న వ్యోమనౌకను నాసా నిద్రలేపనుంది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2009లో సౌరకుటుంబంలో గ్రహశకలాలను గుర్తించేందుకుగాను వైడ్‌ ఫీల్డ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే ఎక్స్‌ప్లోరర్‌ (వైస్‌) అనే వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ వ్యోమనౌక సౌరకుటుంబంలో వేలాదిగా ఉన్న గ్రహశకలాలను గుర్తించింది. 2011 ఫిబ్రవరి నాటికి దీని ప్రాథమిక లక్ష్యం పూర్తయింది. దీంతో శాస్త్రవేత్తలు దీన్ని నిద్రాణ స్థితిలో ఉంచారు. అయితే భూమికి చేరువగా వచ్చే ప్రమాదకర గ్రహశకలాలను గుర్తించేందుకుగాను మళ్లీ దీన్ని నిద్రాణ స్థితినుండి క్రియాశీల స్థితిలోకి తేవాలని నాసా భావిస్తోంది. మరో మూడేళ్లపాటు దీని సేవలను వినియోగించుకోవాలని నాసా అధికారులు నిర్ణయించారు.

భూమికి 4.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో సంచరించే భూ సమీప వస్తువులు (నియో), అంతరిక్ష శిలలను గుర్తించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. వైస్‌లోని 40 సెంటీమీటర్ల టెలిస్కోపు, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ద్వారా దాదాపు 150 శిలలను గుర్తించవచ్చని నాసా భావిస్తోంది. మరో రెండువేల శిలలకు సంబంధించిన ఉష్ణ ధర్మాలను వెలికి తీయాలని కూడా నాసా భావిస్తోంది. ఇటీవల ప్రకటించిన గ్రహశకల యాత్రకు అనువైన శిలను గుర్తించడం కూడా ఈ పరిశోధన లక్ష్యంగా నాసా చెబుతోంది. ఈ యాత్రకింద ఒక గ్రహశకలాన్ని మానవరహిత వ్యోమనౌకద్వారా స్వాధీనం చేసుకుని దాన్ని చంద్రుడి కక్ష్యలోకి చేరవేస్తారు. తర్వాత 2021 నాటికి గ్రహశకల యాత్ర ద్వారా ఆ గ్రహశకలాన్ని సందర్శించాలని నాసా నిర్ణయించింది.

  • Loading...

More Telugu News