: సౌర తుపాను వస్తోంది!
భూమివైపుకి ఒక ప్రమాదకరమైన తుపాను దూసుకువస్తోందట. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. అయితే అది మామూలు సముద్రాల్లో మొదలయ్యే తుఫాను కాదు. ఏకంగా సూర్యుడి మీదనుండి బయల్దేరిన సౌరతుపాను. అత్యంత వేడి గాలులతో కూడిన ఈ తుపాను సూర్యుని ఉపరితలం నుండి బయల్దేరిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నాసాకు చెందిన శాస్త్రవేత్తలు సూర్యుడి నుండి అతిపెద్ద మేఘరూపంలో ఉన్న వేడికణాల సమూహంతో కూడిన తుపాను మంగళవారం నాడు బయల్దేరిందని గుర్తించారు. భూమి లక్ష్యంగా అత్యంత వేడి కణాలతో కూడిన తుపాను భూమి వైపు రావడం మొదలైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుపానును కరోనల్ మాస్ ఎజెక్షన్`సీఎంఈ అంటారు. నాసాలోని 'సోలార్ టెరెస్ట్రియల్ రిలేషన్స్ అబ్జర్వేటరీ' ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ తుపాను భూమి లక్ష్యంగా గంటకు 33 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో భూ ఆవరణకు చేరుకోవచ్చని, అయితే ఈ వేడి కణాలు భూమి ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించలేవు కాబట్టి మనకు ప్రత్యక్ష ముప్పు ఏమీ ఉండబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.