: రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటిన పాక్ మహిళ
సోదరభావానికి ఎల్లలు అడ్డుకాదని నిరూపించింది ఓ పాకిస్తాన్ మహిళ. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ మహిళ సరిహద్దులు దాటి భారత్ చేరింది. మధ్యప్రదేశ్ లో తాను సోదరసమానుడిగా భావించే ఓ వ్యక్తికి రాఖీ కట్టి మురిసిపోయింది. షాహిదా ఖలీల్ అనే 45 ఏళ్ళ మహిళ తన కజిన్ కు మిత్రుడైన పంకజ్ బాఫ్నా అనే భారతీయుడికి రాఖీ కట్టాలని ఐదేళ్ళ నుంచి నిరీక్షిస్తోంది. అయితే, ఇన్నాళ్ళకు ఆమెకు వీసా మంజూరు అయింది. దీంతో, సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన షాహిదా మధ్యప్రదేశ్ లోని హర్దా వచ్చి పంకజ్ కు రాఖీ కట్టేసింది. మీడియాతో మాట్లాడుతూ, తాము 30 ఏళ్ళ క్రితం భారత్ నుంచి పాక్ వలస వెళ్ళామని, బాల్యంలో హర్దాలో ఎంతోమంది నేస్తాలుండేవారని గుర్తు చేసుకుంది. పంకజ్ తన కజిన్ దిలిప్ ఖాన్ కు స్నేహితుడని వివరించింది.