: ఆకారపుష్టి... ఏడాది నాస్తి...!
మనవాళ్లు ఒక సామెత చెప్పినట్టు చూసేందుకు అది చాలా పెద్ద గ్రహం... అయితే అక్కడ ఏడాది మాత్రం చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చక్కగా మీరు మాంఛి నిద్రపోయి లేచినంత సమయం మాత్రమే. అంత తక్కువ సమయం ఆ గ్రహంలో ఏడాది గడిచిపోతుంది. మరి రోజు సమయం ఎంత ఉంటుందో ఆలోచించండి....
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు సౌరకుటుంబం వెలుపల ఉన్న ఒక గ్రహాన్ని గుర్తించారు. దీనికి 'కెప్లర్ 78బి' అని పేరు పెట్టారు. ఈ గ్రహం ఉండేందుకు భూమి అంత పెద్ద ఆకారాన్ని కలిగివుంది. అయితే దీని పరిభ్రమణ కాలం మాత్రం విశ్వంలోనే అతి తక్కువ సమయం. ఎంత అంటే భూమిపై మనం ఒక రోజు నిద్రపోయి లేచినంత అంటే సుమారు 8.5 గంటల సమయం. శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా కనిపెట్టిన అతి తక్కువ పరిభ్రమణ కాలం ఉన్న గ్రహం ఇదే. భూమినుండి సుమారు 700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి దాని నక్షత్రానికి మధ్య దూరం మన పాలపుంతలో సూర్యుడు, బుధగ్రహానికి మధ్య ఉన్న దూరంకంటే కూడా 40 రెట్లు తక్కువ. అంత తక్కువగా ఉండడం వల్ల దాని నక్షత్రంపై ఈ గ్రహ ప్రభావాన్ని సులభంగా అంచనావేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిద్వారా ఆ గ్రహం ద్రవ్యరాశిని తెలుసుకోవచ్చని అదేజరిగితే మన సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలకు సంబంధించి మనం ద్రవ్యరాశి గురించి తెలుసుకున్న తొలి గ్రహం ఇదే అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.