: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా...?
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే వెంటనే ఈ సూత్రాన్ని ఫాలో అయిపోండి. ఎంచక్కా బరువు తగ్గేయొచ్చు అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు. మనలో చాలామంది అధిక బరువుతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు. ఎలాగైనా తమ బరువును తగ్గించుకోవాలని పలు రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వ్యాయామాలు చేయడం, డైటింగ్ చేయడం వంటివి అందరికీ తెలిసినవే. అయితే బరువు తగ్గాలనుకునేవారికి ఒక సులువైన మార్గాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం వ్యాయామం చేయడం వంటివి చేసే సమయంలో ఎంతో కొంత తిండి తగ్గించాల్సి ఉంటుంది. అయితే మీరు ఎలాంటి తిండి తగ్గింపులు చేసుకోకుండానే చక్కగా బరువు తగ్గవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు బరువు తగ్గాలనుకునేవారికి ఒక కొత్త రకం సలహా ఇస్తున్నారు. అదేమంటే తిండి తగ్గించకుండా, ఎలాంటి వ్యాయామం చేయకుండా చక్కగా బరువు తగ్గాలనుకునేవారు ఎంచక్కా పర్వతాలపైకి షికారుకు వెళ్లండి అంటున్నారు. అప్పుడు చక్కగా మీరు బరువు తగ్గుతారట. అయితే ద్రవ్యరాశి మాత్రం తగ్గకపోవచ్చని కూడా ముందే నిజం చెప్పేస్తున్నారు శాస్త్రవేత్తలు. పర్వతాలపైన ఎత్తుకు వెళ్లేకొద్దీ భూమ్యాకర్షణ శక్తి తగ్గడం వల్ల బరువులో మార్పు రావడం మాత్రం జరుగుతుంది. అయితే ద్రవ్యరాశిలో మాత్రం మార్పు రాకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా బరువులో మాత్రమే మార్పు రావడానికి కారణం భూమ్యాకర్షణ శక్తిలో మార్పులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.