: బ్లడ్ క్యాన్సర్‌కు కొత్త తరహా చికిత్స చేయవచ్చు
బ్లడ్‌క్యాన్సర్‌ను ప్రభావితం చేసే ఒక కొత్తరకం జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యువును గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఈ క్యాన్సర్ నివారణకు ఒక కొత్తరకం చికిత్సా విధానాన్ని రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
లండన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ముసలితనాన్ని ప్రభావితం చేసే ఒక లోపభూయిష్టమైన జన్యువు బ్లడ్క్యాన్సర్కు దారితీస్తున్నట్టు తేలింది. ఈ జన్యువు క్యాన్సర్ కణాలు మనుగడ సాగించేలాచేసి వాటి సామర్ధ్యాన్ని పెంచుతున్నట్టు వీరి పరిశోధనల్లో తేలింది. బ్లడ్క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించే రకం మైలోమా. ఈ వ్యాధికి సంబంధించి శాస్త్రవేత్తలు ఒక జన్యువును గుర్తించారు. ఈ జన్యు మార్కర్‌కు టీఈఆర్సీ అనే జన్యువుతో సంబంధం ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ జన్యువు డీఎన్ఏ అంచుల్లో ఉండే టెలోమీర్ల అనే తొడుగుల పొడవును నియంత్రిస్తుంది. ఆరోగ్యవంతమైన కణాల్లో ఈ తొడుగులు కాలం గడిచేకొద్దీ తరిగిపోతుంటాయి. అయితే కొన్ని క్యాన్సర్ వ్యాధికి చెందిన కణాలు మాత్రం ఈ జన్యువు సంకేతాలను పట్టించుకోకుండా తమ విభజనను కొనసాగిస్తుంటాయి. ఈ విషయాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు బ్లడ్‌క్యాన్సర్ విషయంలో టీఈఆర్సీ పాత్రను నిర్ధారిస్తే తర్వాత కాలంలో దీన్నే లక్ష్యంగా చేసుకుని బ్లడ్క్యాన్సర్కు కొత్తరకం చికిత్సను చేయవచ్చని చెబుతున్నారు.