: కోలాలతో కోపం పెరుగుతుందట
ఇప్పుడు పిల్లలు ఎక్కువగా కోలాలను లాగించేస్తుంటారు. కొందరైతే ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఈ డ్రింక్స్ పిల్లల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని, వారి ప్రవర్తనపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది.
కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో సాఫ్ట్‌డ్రింక్స్ ఎక్కువగా తాగే పిల్లల్లో ఈ డ్రింక్స్ అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు తేలింది. ఇలాంటి డ్రింక్స్ ఎక్కువగా తాగే పిల్లల్లో తరచూ కోపం రావడం, ఏదైనా నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం, ఎదుటివారి వస్తువులను లాక్కోవడం, ఇతరులతో కోట్లాటకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని 20 పెద్ద నగరాలకు చెందిన మూడువేల మంది ఐదేళ్ల వయసున్న పిల్లలు వారు తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ వారి ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే విషయాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికొచ్చారు.