: జీవముద్రలతో క్యాన్సర్ ముప్పును గుర్తించొచ్చు
మన శరీరంలో రసాయనిక ప్రతిచర్యల ప్రభావం వల్ల కణాల్లో కొన్ని రకాల ముద్రలు పడతాయి. ఈ ముద్రల ద్వారా క్యాన్సర్ వ్యాధి తీవ్రతను పసిగట్టడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కనిపించే క్యాన్సర్ వ్యాధుల్లో పేగులకు సంబంధించిన క్యాన్సర్ మూడవది. ఈ వ్యాధిని ఇలాంటి జీవ ముద్రల ద్వారా పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు జీవక్రియల ముద్రను పరిశీలించడం ద్వారా పేగుల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్రతను పసిగట్టవచ్చని పరిశోధనలో గుర్తించారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా పది లక్షల పేగులకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయని అంచనా. పేగుల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్స చేయాలి? అనే విషయాన్ని నిర్ణయించడానికి కణితి దశను కచ్చితంగా గుర్తించడం చాలా అవసరం. దీనికి జీవక్రియల ముద్రలు కూడా తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన శరీరంలో పడే జీవక్రియ ముద్రలను రక్తం, మూత్రం, కణజాలం నమూనాల్లో చూడవచ్చని, కణితి ఏర్పడినప్పుడు, పెరిగినప్పుడు ఈ ముద్రలు మారుతుంటాయని, అందువల్ల పేగులకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధి తీవ్రతను గుర్తించడానికి సీటీ, ఎంఆర్ఐ వంటి పరిజ్ఞానాలతోబాటు ఈ జీవక్రియల ముద్రలు కూడా చక్కగా ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.