: ఇప్పుడే స్వేచ్ఛ లేకపోతే విభజన తర్వాత పరిస్థితేంటి?: ఏపీఎన్జీవో
హైదరాబాదులో నిరసన తెలిపే స్వేచ్ఛ ఇప్పుడే లేకపోతే, విభజన తర్వాత పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ కుమార్. తాము శాంతియుతంగానే ఉద్యమిస్తున్నామని, హైదరాబాదులోని ప్రతి కార్యాలయంలోనూ నిరసన తెలిపే అవకాశం కల్పించాలని ఆయన తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, గత అర్ధరాత్రి ఆరంభమైన సమ్మె శాంతియుతంగా సాగుతోందన్నారు. సీమాంధ్రలో పరిపాలన స్తంభించిందన్నారు. వ్యక్తిగత దూషణలకు తావులేకుండా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో చర్చ జరగాలని అభిలషించారు. ఇక ఉద్యమంలో ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్ళకు లొంగేది లేదని స్పష్టం చేశారు.