: 'అరాచక' వ్యాఖ్యల వల్ల వాయిదా పడిన రాజ్యసభ
రాజ్యసభలో 'అరాచక' దుమారం రేగింది. ఈ రోజు ఉదయం సభ ఆరంభం కాగానే బీజేపీ సభ్యులు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. ఇంతలో 'సేవ్ ఆంధ్ర' అంటూ టీడీపీ సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసనలు తెలుపసాగారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు దీటుగా స్పందిస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను 'అరాచకమయం'గా చేయాలనుకుంటే తాను చేయగలిగిందేమీ లేదని అంటూ సభను వాయిదా వేశారు. దీంతో మళ్లీ 12 గంటలకు పీజే కురియన్ అధ్యక్షతన సమావేశమైన సభలో 'అరాచక' వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో రికార్డులు పరిశీలించాల్సి ఉందని సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.