: పెంగ్విన్ అవ్వకు హ్యాపీబర్త్‌డే
అనగనగా ఒక పెంగ్విన్ అవ్వ. ఆ అవ్వ ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకుంది. పెంగ్విన్ అవ్వ ఏంటి అనుకుంటున్నారా... ఎక్కువ వయసున్న వారిని ఏమంటాం... అవ్వ లేక తాత అంటాంకదా... అలాగే ఇప్పుడు కూడా పెద్ద వయసున్న పెంగ్విన్‌ను కూడా అవ్వ అనే అనుకుంటాం... సదరు అవ్వ పెంగ్విన్ పేరు మిస్సీ. ఆవిడగారికి ఈమధ్యే 36వ పుట్టినరోజు జరిగింది.
సహజంగా పెంగ్విన్‌లు ప్రకృతిలో ఉండి బతకడం కాదు... సంరక్షణ కేంద్రాల్లో బతికే విషయంలో మామూలుగా అయితే 26 ఏళ్లదాకా జీవిస్తాయి. అయితే మిస్సీ అనే పెంగ్విన్ మాత్రం ఏకంగా 36 ఏళ్లు బతికేసింది. దీంతో సదరు సంరక్షణా కేంద్రం వారు కింగ్ పెంగ్విన్ మిస్సీకి హ్యాపీ బర్త్‌డే అంటూ సంబరాలు చేసేస్తున్నారు. వయసు పెరగడంతో పాపం మిస్సీకి కాస్త చూపు మందగించిందట. అయినాకూడా అక్కడ మిస్సీదే పెత్తనం. ఇప్పటి వరకూ అక్కడున్న పెంగ్విన్లలో మిస్సీనే పెద్దది. దీంతో దీనికి సంబంధించిన అన్ని వివరాలను గిన్నిస్ బుక్ వారికి పంపిస్తామని సంరక్షణ కేంద్రం నిర్వహకులు చెబుతున్నారు. దీంతో మిస్సీ గిన్నిస్ బుక్ కూడా ఎక్కేస్తుందేమో.