: నా రాష్ట్రంలో శాంతి నెలకొల్పండి: సీఎం రమేష్


నా రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే నిర్ణయాలు తీసుకోండని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆవేదనతో అర్ధించారు. రాజ్యసభలో రాష్ట్ర విభజనపై ఆయన మాట్లాడుతూ రెండు సార్లు అత్యధిక ఎంపీలను ఇచ్చి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన బహుమతి అశాంతని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన చిచ్చు రేగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని బాధాతప్త హృదయంతో వెల్లడించారు. కేవలం పంచాయతీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ పార్టీ విభజన ప్రకటించిందని మండిపడ్డారు.

కేవలం ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేకే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తెలిపిందని విమర్శించారు. ముందుగా పీఆర్పీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల్లో తమకు అడ్డం వస్తుందేమోనని భావించి, తెలంగాణ ఏర్పాటు ప్రకటించి టీఆర్ఎస్ పార్టీ విలీనాన్ని ప్రతిపాదించిందని ఆక్షేపించారు. ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ రాజకీయాలు చేయగా లేనిది, మేము రాజకీయాలు చేస్తే తప్పా? అని ప్రశ్నించారు.

రమేష్ వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ సభ్యులు అతని ప్రసంగానికి అడ్డుపడ్డారు. స్పీకర్ వాటిని పరిశీలించి తొలగిస్తామని చెప్పడంతో వారు శాంతించారు. అనంతరం మాట్లాడిన ఎంపీ సీఎం రమేష్ తక్షణం రాష్ట్ర విభజనను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పిన తరువాత. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కమిటీ వేసి వారి అభిప్రాయం ప్రకారం విభజన, సమైక్యం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News