: ఇదో వెరైటీ పోటీ!
పోటీలు రకరకాలుగా ఉంటాయి... మామూలుగా ఆటల పోటీలే కాదు... ఆహారం తినే పోటీలు... అరిచే పోటీలు ఇలా పలు రకాలుగా పోటీలు జరుగుతుంటాయి. వీటి గురించి మనం వింటూనే ఉంటాం. అయితే అక్కడ మాత్రం వెరైటీ పోటీ జరుగుతుంటుంది. అదేమంటే తేనెటీగల పోటీ... ఒక్క తేనెతుట్టెను కదిలిస్తే... ఇక రయ్ మంటూ పైకిలేచిన తేనెటీగలు చుట్టుపక్కల ఉన్నవారిని కుట్టి చంపేసిన వైనాన్ని మనం వింటూనే ఉంటాం... అలాంటిది తేనెటీగల పోటీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా... అయినా ఇది మాత్రం నిజం. ఈ తేనెటీగల పోటీలో ఎక్కువ తేనెటీగలను తమ వంటిపైకి రప్పించుకున్న వారికి గెలుపు ఖాయం.
కెనడాలోని ఒంటారియాలో ఒక పోటీ జరుగుతుంటుంది. దీని పేరు 'క్లావర్ మేడ్' పోటీ. ఇందులో తేనెటీగలను గడ్డంలాగా మార్చుకుని క్యాట్‌వాక్‌లు చేయడం జరుగుతుంటుంది. ఈ ఏడాదికూడా ఈ పోటీ చక్కగా జరిగింది. ఈ పోటీలో ముందుగా పోటీదారు ముఖంపైన రాణితేనెటీగను పెడతారు. ఇక రాణిగారిని వెదుక్కుంటూ మిగిలిన తేనెటీగల గుంపు రయ్ మంటూ పోటీదారు ముఖాన్ని ముసురుకుంటాయి. ఇలా ఎవరు ఎక్కువ సంఖ్యలో తేనెటీగలతో అందమైన గడ్డాన్ని తయారు చేసుకుంటారో వారే ఈ పోటీలో విజేత. అయితే ఉత్తినే తేనెతుట్టెను కదలిస్తేనే కుట్టిపెట్టే తేనెటీగలు పోటీదారులను కుట్టవా అని మీ అనుమానం కదూ... ఏమీ కుట్టవు. ఎందుకంటే తేనెటీగలకు పోటీని నిర్వహించే వారు చక్కగా చక్కెర నీళ్లతో వాటికి ఆహారం ఇస్తారు కాబట్టి అవి సంతోషంగా కుట్టకుండా పోటీలో పాల్గొంటాయిమరి!