: వలసలను గుర్తించేందుకు ఉపగ్రహం
జీబ్రాలు పచ్చగడ్డికోసం వలసలు వెళుతుంటాయి. అయితే ఎప్పుడు ఎక్కడికి వలస వెళ్లాయి? అనే విషయాన్ని గుర్తించడం కష్టం. దీంతో జీబ్రాల వలసలను గుర్తించేందుకు ఉపగ్రహ సాయం తీసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉపగ్రహం అందించే సమాచారంతో జీబ్రాలు ఎక్కడికి వలసలు వెళుతున్నాయి? అనే విషయాన్ని ఇట్టే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆఫ్రికాలోని బోట్సువానాలో ప్రపంచంలోనే సుదీర్ఘమైన జీబ్రాల వలస జరుగుతుంది. అయితే జీబ్రాలు గుంపులు గుంపులుగా ఎక్కడికి వలస వెళతాయి అనే విషయాన్ని ఇప్పటి వరకూ గుర్తించలేకపోయారు. దీంతో జీబ్రాల వలసలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు జీపీఎస్ ట్రాకింగ్, నాసా ఉపగ్రహ సమాచారాన్ని ఉపయోగించాలని భావించారు. ఉపగ్రహాలు భూమిపైని రోజువారీ వాతావరణంలో తలెత్తే మార్పులతోబాటు జీబ్రాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఫోటోలు తీసే అవకాశం ఉంది. నాసాకు చెందిన వర్షాలు, ఆవరణకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించుకుని భూములు ఎప్పుడు పచ్చగా మారుతాయి అనే విషయాన్ని గుర్తించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
జీబ్రాలు పచ్చగడ్డికోసం ఎప్పుడు ప్రస్థానాన్ని ప్రారంభిస్తాయనేది ఉపగ్రహ సాయంతో అంచనా వేసే అవకాశం ఉంది. జంతువులు వలస వెళ్లేందుకు ప్రేరేపిస్తున్న అంశం ఏంటి... అవి ఎలాంటి జాడలను ఉపయోగించుకుంటున్నాయి? వాతావరణంలో మార్పులకు వాటి వలసలు ఎలా స్పందిస్తాయి అనే విషయాలు ఈ సమాచారం వల్ల వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జంతు సంరక్షణలో ఉపగ్రహ సాయం తీసుకోవడం అనేది ఒక శక్తిమంతమైన సాధనంలాగా తోడ్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.