: రాజశేఖర రెడ్డి ప్రతిపాదన మేరకే తెలంగాణ విభజన జరిగింది: దిగ్వజయ్ సింగ్


దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రతిపాదన మేరకే రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె యోచన విరమించుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనపై ఎలాంటి సందేహాలనైనా ఆంటోనీ కమిటీకి తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా చర్చలు సాగుతాయన్నారు. సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీడబ్ల్యూసీ కోరిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్ధులు హైదరాబాద్ లో చదువుతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని అన్నారు. వైఎస్ ప్రతిపాదన, సభలో చేసిన ప్రకటన అంశాలను వైఎస్సార్ సీపీ గుర్తించాలని కోరారు. చంద్రబాబునాయుడు రాసిన లేఖపై దిగ్విజయ్ స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ అఖిలపక్షం సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తెలిపిందని, విభజన జరిగిన తరువాత యూ టర్న్ తీసుకుందని అన్నారు. టీడీపీలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించదని, మాటకు కట్టుబడి ఉంటామని డిగ్గీరాజా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News