: ఇక 'ఆధార్' తప్పనిసరి కాదు
ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరికాదని రాజ్యసభలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా, పాఠాశాలల్లో అడ్మిషన్లు, పాస్ పోర్టు పొందాలన్నా, వ్యక్తిగతంగా ఏదైనా అవసరమైనా, ఇంకా ఇతర వాటికి ఆధార్ ను ఇవ్వాల్సిన అవసరం లేదని లిఖిత పూర్వక సమాధానంలో ప్రణాళిక మంత్రి రాజీవ్ శుక్లా వెల్లడించారు. అయితే, ఎల్ పీజీ గ్యాస్ ను సబ్సిడీలో పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని చెప్పారు.
ఎల్ పీజీ కోసం మూడు నెలల్లో కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ప్రవేశపెట్టేంత వరకు ఆధార్ నంబర్ ను జత చేయాలన్నారు. డీబీటీని దేశంలోని 20 జిల్లాల్లో తీసుకురానున్నామని తెలియజేశారు. కాగా, మార్కెట్ లో నిర్ణయించబడిన ధర ప్రకారం ఎల్ పీజీ సిలిండర్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరికాదని పేర్కొన్నారు.
ఈ ఏడాది జులై 26 వరకు 39 కోట్ల 36 లక్షల ఆధార్ కార్డులు జారీచేశామని, ఇంకా 42 కోట్ల 65 లక్షల ఆధార్ నెంబర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని మరో లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి శుక్లా తెలిపారు. ఒక్క ఢిల్లీలోనే జులై 26 వరకు కోటి 44 లక్షల నంబర్లు నమోదైనట్లు వెల్లడించారు. అయితే, ఆధార్ నమోదు సందర్భంగా తీసుకున్న డేటాను నమోదు ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నారన్న దానికి సమాధానమిస్తూ.. అలాంటి అవకాశం లేదని మంత్రి హామీ ఇచ్చారు.