: సీఎం ఇంట్లో కూర్చుని ఫిడేలు వాయిస్తున్నారా?: సోమిరెడ్డి ఆగ్రహం


ఓవైపు సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళన జ్వాలలు మిన్నంటుతుంటే, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఫిడేలు వాయిస్తున్నారా? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కిరణ్ తాను ముఖ్యమంత్రినన్న విషయం మరిచిపోయి, రాష్ట్రం తగలపడిపోతున్నా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సోమిరెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ, ఇంత జరుగుతున్నా సీఎం మౌనం వీడడంలేదని వ్యాఖ్యానించారు.

ఇక పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదన్నారు. తిరుపతి వెళ్ళి గుండుకొట్టించుకుని, నామాలు పెట్టుకుని జై సమైక్యాంధ్ర అంటాడని.. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళు ఏం చెబితే దానికి తలూపి వస్తాడని విమర్శించారు. ఇక కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి కొందరు నేతలను వెంటబెట్టుకుని వెళ్ళి సోనియాను కలవడాన్ని సోమిరెడ్డి ఆక్షేపించారు. సీమాంధ్ర కోసం తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్న తరుణంలో ఆయన గ్రేటర్ రాయలసీమ కావాలని అడగడం స్వార్థపూరితమని ఆరోపించారు.

ఇక కేసీఆర్ ను హత్య చేసేందుకు కొందరు కుట్ర పన్నారని హరీశ్ రావు, ఈటెల ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నారు. తాము మావోయిస్టుల అజెండాను అనుసరిస్తామని చెబుతున్న గులాబీ బాస్, ఇంటింటికి లైసెన్స్ లేని తుపాకులివ్వగలరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News