: రెడ్ లైట్ ఏరియా నుంచి అమెరికా వరకు..


మట్టిలో మాణిక్యం.. బురదలో పుట్టిన తామర పువ్వు ఇలా ఏ వర్ణనలకు అందని జీవితం ఆమెది. కుల వివక్ష, జాతి వ్యతిరేకత, సమాజం చిన్నచూపు, తండ్రి నిర్లక్ష్యం, కడుపు మంట, నిరంతరం వెంటాడే కామాంధుల చూపులు.. ఇలా ఒక మనిషి జీవితంలో భరించలేని కష్టాలు, కన్నీళ్ల మాటున జీవించిన శ్వేత ఉన్నత చదువులు చదివేందుకు అమెరికాకు పయనమైంది. ఈ ఉపోధ్ఘాతమంతా ఎవరి కోసమనేగా..! ప్రపంచ ప్రఖ్యాత పత్రిక 'న్యూస్ వీక్' యంగ్ వుమెన్ టు వాచ్ పేరిట ఎంపిక చేసిన 25 మంది బాలికల్లో ఒక్కరిగా నిలిచిన శ్వేతా కత్తి(18) గురించి. ఈ జాబితాలో తాలిబాన్ దాడిలో గాయపడి కోలుకున్న మలాలా కూడా ఉందండోయ్.

ముంబై గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ రెడ్ లైట్ ఏరియా కూడా ఉందన్న విషయం తెలిసిందే. కామాటిపుర ప్రాంతంలో నిత్యం మనిషి మలినమయ్యే ప్రాంతంగా దానికి పేరు. అక్కడ నిత్యం ఏదో ఒక గొడవ! ఎవరో ఒకరు మహిళల్ని హింసిస్తూనే ఉంటారు. పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కావాల్సింది దోచుకుని వెళ్లేవారు. నచ్చినా నచ్చకపోయినా, ఆరోగ్యం సహకరించినా సహకరించకున్నా తప్పనిసరిగా వ్యభిచారం చేయాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న శ్వేతను 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ రెండేళ్ల క్రితం రెడ్ లైట్ ఏరియానుంచి తీసుకెళ్లి ఆమెలోని నైపుణ్యానికి సానబెట్టింది.

'క్రాంతి' ఆసరాతో శ్వేత ఇంగ్లీష్ తో పాటు సైకాలజీపై మక్కువ పెంచుకుంది. పట్టుదలగా చదివింది. అత్యంత హేయమైన తన గతాన్ని మర్చిపోకుండా, తన తల్లి(ఫ్యాక్టరీ కార్మికురాలు) కష్టాన్ని వృధా కానివ్వకుండా న్యూయార్క్ లోని బార్ట్ కాలేజీలో సైకాలజీ చదివేందుకు స్కాలర్ షిప్ సంపాదించింది. ఈ క్రమంలో సైకాలజీలో పీజీ చేసేందుకు అమెరికా పయనమైంది. బాగా చదువుకుని తాను ఎక్కడైతే నరకాన్ని చూశానో అదే ప్రాంతంలోని వారి అభ్యున్నతికి పాటుపడతానని చెప్పింది. తల్లే తనకు స్ఫూర్తి ప్రదాత అని చెప్పిన శ్వేత, ఆమే తన సర్వస్వం అని తెలిపింది.

  • Loading...

More Telugu News