: ఈ బర్గర్ ధర కోటి పైమాటే
బర్గర్ వెల సాధారణంగా ఎంతుంటుంది... సాధారణ మధ్యతరగతి వ్యక్తులు కూడా కొనగలిగే రేటులోనే ఉంటుంది. అయితే ఈ బర్గర్ వెల ఎంతో తెలుసా... ఒక కోటీ 29 లక్షల రూపాయల పైమాటే... మరి ఈ బర్గర్ వెల అంత ఉండడానికి దీని ప్రత్యేకత ఏంటో...? అనేగా మీ అనుమానం... దీన్ని తయారు చేసిన విధానం అంత ప్రత్యేకమైంది. ఈ బర్గర్ తయారుచేసేందుకు ఉపయోగించిన 'మాంసాన్ని' ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేశారు. కాబట్టే అంత రేటుమరి.
నెదర్లాండ్స్‌లోని ఒక ప్రయోగశాలలో మూల కణాలపై శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు జరిపారు. ఆవు మూలకణాలనుండి తయారైన దాదాపు ఇరవై వేల దారపు పోగులలాంటి ఎర్రని మాంసాన్ని మెత్తని ముద్దలా తయారు చేసి శీతలీకరించారు. అవసరమైనప్పుడు ఈ ముద్దను తీసి దగ్గరకు చేసి చపాతీలా చేతితో తయారు చేశారు. తర్వాత బర్గర్ తయారీకి కావలసిన రీతిలో దీన్ని వండినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు సుమారు ఐదేళ్లపాటు దీన్ని తయారు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
ఆవు మూలకణాలనుండి ప్రయోగశాలలో ఇలా కృత్రిమ మాంసాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఆవు కండరాల మూలకణాలకు కొన్ని పోషకాలు, పెరుగుదలకు ఉపకరించే రసాయనాలను జోడించడం ద్వారా ప్రయోగశాలలో ఈ మూలకణాలు బాగా పెరిగాయి. మూడు వారాల్లోనే పదిలక్షలకు పైగా మూలకణాలు పెరిగి వాటిని ఉంచిన పాత్రల్లో సెంటీమీటరు పొడవు, కొన్ని మిల్లీమీటర్ల మందంలో ఉండే దారప్పోగుల్లాంటివి ఏర్పడ్డాయి. వీటినే గుండ్రటి ముద్దల్లా చేసి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో శాస్త్రవేత్తలు శీతలీకరించారు. తర్వాత ఇలా తయారైన బర్గర్ బేస్‌మీద కోడిగుడ్డు, బ్రెడ్ ముక్కలను చేర్చారు. తర్వాత బీట్‌రూట్ రసాన్ని, కాస్తంత కుంకుమపువ్వును చేర్చి చక్కటి బర్గర్‌ను వండారు. దీన్ని బహిరంగంగానే వండి రుచి చూసేందుకు ప్రజలకు ఇచ్చారు.
ఇలా ప్రయోగశాలలో తయారైన మాంసంతో వండిన ఈ బర్గరు ఖరీదు కోటీ 29 లక్షల రూపాయలపైమాటే దీని బరువు 142 గ్రాములు. ఇలా ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న ఈ మాంసంతో తయారైన బర్గర్ ఎలాంటి వాసన లేదని దీన్ని తిన్న ప్రజలు కూడా చెబుతున్నారు. సాధారణ బర్గర్లలో ఉండే పోషకాలు, సుగుణాలు అన్నీ కూడా ఈ బర్గర్‌లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.