: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు రాబోతుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరగడంతో కరవు భత్యం(డీఏ) కూడా ఎక్కువగా పెరగబోతోంది. డీఏను 10 నుంచి 11 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంలో డీఏ 80 శాతంగా ఉంది. తాజా పెంపుతో అది 90 శాతానికి చేరనుంది. పెంపునకు సంబంధించిన ప్రకటన వచ్చే నెల మొదట్లో రానుంది. ఇప్పటివరకూ వేసిన లెక్కల ప్రకారం డీఏ 10 నుంచి 11 శాతం మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 30న వెలువడనున్న పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన వినియోగ ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) గణాంకాలు వెలువడనున్నాయి. గతనెల 31న సూచీ 11.06 శాతంగా ఉంది. దీని ఆధారంగా చూస్తే డీఏ పెంపు 10 శాతంగా ఉంటుందని, సెప్టెంబర్ లో ప్రకటన రావచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్న్ మెంట్ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్ కెకెఎన్ కుట్టీ చెప్పారు. సహజంగా కేంద్ర ప్రభుత్వ పెంపునకు కొంచెం తక్కవగా రాష్ట్ర ప్రభుత్వం డీఏ ప్రకటిస్తూ ఉంటుంది. కేంద్రం 10 శాతం పెంచితే రాష్ట్రంలో పెంపు 8 శాతం లేదా 8.5శాతంగా ఉండవచ్చు.