: దేశాన్ని అస్థిరపరచడమే పేలుళ్ల లక్ష్యం: వెంకయ్య నాయుడు


వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో షిండే ప్రకటనకు ముందే హైదరాబాదు పేలుళ్ల ఘటనపై విపక్ష సభ్యులు చర్చకు పట్టబట్టడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సర్ధి చెప్పినా వినకుండా చర్చ చేబట్టాలని గట్టిగా కోరారు. దీంతో అన్సారీ ముందు హోంమంత్రి ప్రకటన చేశాక చర్చ చేద్దామని చెప్పడంతో సభ్యులు సద్దుమణిగారు. లోక్ సభలో చేసిన ప్రకటననే షిండే ఇక్కడా చేశారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... దేశాన్ని అస్థిరపరచడంలో భాగంగానే పేలుళ్లు జరుగుతున్నాయని అన్నారు.

పొరుగుదేశం ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామనీ, ఉగ్రవాదుల సవాళ్లకు మనం ఏమీ చేయలేకపోతున్నామనీ ఆయన అన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించడ లేదని నాయుడు ఆవేశంగా మాట్లాడారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు బహిరంగ సభలు పెట్టి, భారత్ కు సవాళ్లు విసురుతున్నారని అన్నారు. అఫ్జల్ గురు ఉరితీతకు కక్ష తీర్చుకుంటామని ఉగ్రవాదులు సవాల్ విసిరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

హోంమంత్రి షిండే హైదరాబాదుకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని వ్యాఖ్యానించిన ఆయన, పేలుళ్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా షిండే వద్ద లేదన్నారు. హైదరాబాదులో పేలుళ్ల ఘటనలు పునరావృతం అవుతున్నాయనీ, హైదారాబాదు పేలుళ్లపై చర్చ చేపట్టిన విధానం అసంతృప్తిగా ఉందనీ అన్నారు. నిఘావర్గాలు హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దిల్ సుఖ్ నగర్ ఘటనపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని నాయుడు హెచ్చరిక చేశారు.

  • Loading...

More Telugu News