: 40 ఏళ్ళ కిందే 'తెలంగాణ'ను తేల్చాల్సింది: ఎంపీ అనంత
నలభై సంవత్సరాల కిందటే కాంగ్రెస్ తెలంగాణను తేల్చి ఉంటే తమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకునే వారమని అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. కర్నూలో, విశాఖనో, ఒంగోలో, ఏదో ఒకటి మహా నగరాలుగా అభివృద్ధి చెందేవన్నారు. ఎన్ని తరాలు మారినా హైదరాబాదు వంటి నగరాన్ని తాము మళ్లీ నిర్మించుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. జలవివాదాలను పరిష్కరించుకోగలమా? అని అడిగారు.
రాష్ట్రంలో ఆనాటి రాజధానిగా కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ ఇన్ని నగరాలు అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉన్నా హైదరాబాదునే అభివృద్ధి చేశామన్నారు. ఎప్పుడూ వేరే రకంగా ఆలోచించకుండా హైదారాబాదు తమదని ఆలోచించడం వల్లే అభివృద్ధి అయిందన్నారు. ఇప్పటికే హైదరాబాదులో ఎన్నో రకాల పరిశ్రమలు ఏర్పడ్డాయని, పలువురు ఇక్కడే తమ సంస్థలను పెట్టుకుని సెటిల్ అయ్యారని ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్రామిరెడ్డి అన్నారు.
రాయలసీమ మరీ వెనకబడి ఉన్నా ఎవరూ దాన్ని బాగు పరచలేదన్నారు. తమ ప్రాంతం నుంచి ఎంతోమంది పాలకులు వచ్చినా ఎక్కడా రాయలసీమ పురోగతికి నోచుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కలుపుకునిపోవాలని ఆనాడు తాము భావిస్తే, ఈరోజు కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు మోసం చేశాయన్నారు. ఈ విషయంలో తాము అందరం వైఫల్యం చెందామని ఒప్పుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తుందని తాము ఏనాడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 ప్రకటన చేసి, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుచేసి కూడా ముందస్తు ప్రణాళికలతోనే దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారని తమకు అర్ధమైందన్నారు.