: తెరపైకి 'రాయల ఆంధ్రా' .. సీమ మంత్రుల కొత్తవాదన


ఏళ్ళ తరబడి పాలకులకు విషమ పరీక్షలా నిలిచిన తెలంగాణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ ఇక ప్రత్యేక రాష్ట్రమంటూ నిన్న కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ఉదయం హైదరాబాదులో మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే ఆంధ్రాతో కలిసి 'రాయల ఆంధ్రా'గా ఏర్పడేందుకు మొగ్గు చూపుతామని స్పష్టం చేశారు. లేకుంటే, గ్రేటర్ రాయలసీమగానో, రాయలసీమగానో ఉంటామని, ఏ ప్రాంతంతోనూ కలిసే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు.

రాయలసీమ ఇప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతమని చెప్పిన మంత్రులు.. నికర జలాలు, ఆదాయం ఇస్తేనే రాయల ఆంధ్రాకు ఒప్పుకుంటామని, రాజధాని కూడా తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని మెలికపెట్టారు. ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ తీర్మానాన్ని చట్ట సభల్లో ఎలా ఓడించాలన్న విషయమై చర్చిస్తున్నామని టీజీ వెల్లడించారు. న్యాయపోరాటం కోణంలోనూ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. తామిప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News