: మీడియా అన్వేషణలో దొరికిన '5 రూపాయల భోజనం'


ఢిల్లీలో 5 రూపాయలకే భోజనం దొరుకుతుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలన్నీ విమర్శలకు దిగాయి. అయితే ఏకంగా రాజ్యసభ సభ్యుడే సాక్షాత్తూ చెప్పాడు కదా అని మీడియా వాళ్లు ఐదు రూపాయల భోజనం అన్వేషణకు దిగారు. వీధులు, సందులు, గొందులు అన్నీ తిరిగారు కానీ కనుక్కోలేకపోయారు. ఆఖరుకు మురికివాడలు, తోపుడు బళ్లు అన్నీ వెతికారు కానీ ఎక్కడా కనీసం 20 రూపాయల్లేనిదే పరిమిత భోజనం రుచి చూడలేమని తెలిసింది. టీ కూడా ఏడు రూపాయలని తేలింది. 5 రూపాయలకు నీళ్లు మాత్రమే ప్యాకెట్లలో దొరుకుతున్నాయని తీర్మానించుకుని అలసిపోయి చెమటలు కక్కుతూ వెనుదిరిగి పార్లమెంటు హౌస్ కు చేరుకున్నారు మీడియా మిత్రులు.

అప్పుడు తెలిసింది వారికి అసలు విషయం. భోజనం ఎక్కడ 5 రూపాయలకి దొరుకుతుందో తెలిసింది. ఎంపీలకు మాత్రమే అందుబాటులో ఉండే పార్లమెంటు హౌస్ క్యాంటీన్లో 4 రూపాయలకే ప్లేటు ఇడ్లీ సాంబారు దొరుకుతుంది. 6 రూపాయలకే మసాలా దోశ వస్తుంది. ఇవే ఇంత చౌకగా ఉన్నప్పుడు భోజనం మాత్రం అంత చవకగా రాదా అనుకున్న ఎంపీ సదరు వ్యాఖ్యలు చేసి ఉంటారని విలేకర్లు అనుకున్నారట. ఢిల్లీ మొత్తం తిరిగిన జర్నలిస్టులకు పలు అనుభవాలు ఎదురయ్యాయి. అందులో ఓ వ్యక్తి 5 రూపాయలకే భోజనం నిజంగా దొరికితే జీవితాంతం కాంగ్రెస్ కే ఓటేస్తానని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్లాడట.

  • Loading...

More Telugu News