: పేదరికంపై కేంద్రం నిర్వచనం 'క్రూరమైన జోక్' : బీహార్ సీఎం


భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.28, పట్టణాల్లో రూ.32 సంపాదించే వారు పేదవారి కిందకి రారంటూ కొన్ని రోజుల కిందట ప్రణాళిక సంఘం చెప్పిన కాకి లెక్కలపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. పేదవారిపై కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం 'క్రూరమైన జోక్' అని అభివర్ణించారు.

పాట్నాలోని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ..'పేదరికంపై ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనాన్ని నేను అంగీకరించను. కేలరీల ప్రాతిపదికన, డబ్బుతో ఆహారం కొనే విధానాన్ని బట్టి పేదరికాన్ని నిర్ణయించలేము. ఎవరెంత గౌరవంగా జీవిస్తున్నారన్న దాన్నిబట్టే నిర్ణయించగలము'అని పేర్కొన్నారు.

మరోవైపు ఐదు రూపాయలు, రెండు రూపాయలకే ముంబయి, ఢిల్లీల్లో భోజనం తినవచ్చని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ అంటే, కేవలం రూపాయికే సంతృప్తిగా భోజనం చేయవచ్చంటూ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవని అన్నారు. కాగా, 2011-12 నాటికి 21.9 శాతం మంది మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారన్న లెక్కలను తాను ఒప్పుకోనన్నారు. ఇంతకంటే ఎక్కువమంది పేదవారే బీహార్ లో నివసిస్తున్నారని నితీశ్ చెప్పారు.

  • Loading...

More Telugu News