: రాజీనామాల కుట్ర సీఎందే: హరీశ్ రావు


తెలంగాణ అంశం పార్టీల మధ్య చిచ్చు రగుల్చుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండడం పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామాలు ప్రకటించడం సీఎం కుట్రే అని ఆరోపించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసే డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో లేని ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి డబ్బు మూటలు పంపుతున్నది సీమాంధ్రనేతలే అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

అప్పుడు చంద్రబాబు తెలంగాణకు అడ్డుపడితే, ఇప్పుడు వైఎస్సార్సీపీ అడ్డుతగులుతోందని ఆరోపించారు. అఖిలపక్షం సమావేశంలో గోడమీద పిల్లుల్లా వ్యవహరించి తెలంగాణ ప్రజల నోటి దగ్గర కూడు తీశారని దుయ్యబట్టారు. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఆయన విరుచుకుపడ్డారు. ఎవరికోసం రాజీనామాలు చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఇలా రాజీనామాలు చేయడం ఏమిటని నిలదీశారు.

తెలంగాణ అమరవీరులకు జై కొట్టిన విజయమ్మ ఈ విషయమై జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్ కూడా రాజీనామాల విషయంలో ఏం బదులిస్తారని ప్రశ్నించారు. పనిలోపనిగా టీడీపీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు హరీశ్ రావు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నా, సమయానుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇవ్వాల్సిందే అని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయరు అని సూటిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News