: తక్కువ ధరకు దొరుకుతోందనుకుంటే తిప్పలే
తక్కువ ధరకు కొనాలంటే మనందరికీ మహా ఆసక్తి. ఏ వస్తువైనా దాన్ని తక్కువ ధరకు కొనాలనే అనుకొంటాం. అయితే తేనీరు విషయంలో మాత్రం ఇలాంటి ఆలోచన అస్సలు పనికిరాదని పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ ధరకు దొరికే తేనీరు తాగితే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టవుతుందని వీరు హెచ్చరిస్తున్నారు.
సూపర్ మార్కెట్లలో లభించే సుమారు 38 రకాల టీ మిశ్రమాలను, అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్‌ఏఎస్)కు చెందిన పరిశోధకులు ఆహార నమూనాను ఆధారంగా తీసుకుని ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో సూపర్ మార్కెట్లలో వివిధ బ్రాండ్ల పేరుతో లభించే తేయాకు మిశ్రమ పదార్ధాల్లో ఫ్లోరైడ్ ఉంటోందని, వాటిని ఎక్కువ మొత్తంలో వాడితే దంతాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు.
భారత సంతతికి చెందిన అరాధన మెహ్రా కూడా పాలుపంచుకున్న ఈ అధ్యయనంలో తేనీరు, డ్రై టీ, బ్లాక్ టీ, ఇంకా పలురకాలైన తేనీటి కషాయాలను రెండు నిముషాల పాటు మరగించి, సాధారణంగా రోజూ తీసుకునే తేనీటి సరాసరితో పోల్చిచూశారు. ఈ మిశ్రమాల్లో చెప్పుకోదగ్గస్థాయిలో ఫ్లోరైడ్లను గుర్తించినట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లారా చౌన్ తెలిపారు. బ్లాక్ టీకి సంబంధించిన మిశ్రమాన్ని పరిశీలిస్తే లీటరు నీటిలో ఉండాల్సిన ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఫ్లోరైడ్ గాఢత ఉన్నట్టుగా ఈ పరిశోధనలో గుర్తించారు.