: రాష్ట్రపతిగా తొలి ఏడాది ఆకట్టుకున్న ప్రణబ్
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ నేటితో ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీలో నేడు మహాత్మాగాంధీ కాంస్యవిగ్రహావిష్కరణ, అరుదైన ఫోటోల డిజిటలీకరణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హోజరు కానున్నారు. రాష్ట్రపతి ఎస్టేట్ లో నిర్మించిన పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఆయన అధికారిక కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభం కానుంది. సాయంత్రం అన్ని రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులందరికీ విందుతో ఆయన ఏడాది పాలన నేటితో ముగియనుంది.
తొలి ఏడాది రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఆకట్టుకున్నారు. ప్రోటోకాల్ తో సంబంధం లేకుడా ప్రజలను కలుసుకునేందుకు ఆయన ఉత్సాహం చూపించారు. తొలి ఏడాది రెండు విదేశీ పర్యటనలు మాత్రమే చేసిన ప్రణబ్ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు చొరవ చూపించారు. దేశ పర్యటనకు వచ్చిన విదేశీ ప్రతినిధులతో చర్చలు, సమాలోచనల్లో పాల్గొని దౌత్యసంబంధాలను పటిష్టం చేసే దిశగా కృషి చేశారు. అలాగే దేశం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై తనదైన శైలిలో సూచనలు చేస్తూ ప్రభుత్వానికి మార్గదర్శకం వహిస్తున్నారు.
సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ తనదైన శైలిలో స్పందించారు. గత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ లా స్తబ్దుగా ఉన్నారన్న అపప్రధ రాకుండా, అబ్దుల్ కలాంలా దూసుకుపోతున్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటనతో నివ్వెరపోయిన ప్రణబ్, ఆ ఘటనను ఖండించారు. గతంలో సీనియర్ కేంద్ర మంత్రిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ, పలు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పడు గవర్నర్లతో చర్చిస్తూ సూచనలిస్తున్నారు. అలాగే, సాధారణ ప్రజలను సందర్శన నిమిత్తం రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించి ఆయన విలక్షణత చాటుకున్నారు. గత రాష్ట్రపతులకు భిన్నంగా రాష్ట్రపతిగా తొలి ఏడాదే ప్రణబ్ విశేష ప్రజాదరణ స్వంతం చేసుకోవడం విశేషం.