: స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా, సర్కారు పట్టించుకోకుండా గాలికొదిలేసిందని అన్నారు. ముఖ్యమంత్రి నుంచి కమిషనర్ వరకూ, పాఠశాలల సమస్యలపై వినతి పత్రాలిస్తున్నా పట్టించుకునే నాథుడే కనిపించడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెరిగినా వారికి బోధించే ఉపాధ్యాయులు కరవయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31 లోపు పాఠశాలల సమస్యలపై స్పందించకపోతే ఆగస్టు 6 న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.