: వయసు 11ఏళ్లు.. బరువు 98 కిలోలు
కొందరు చిన్నారులు అదే పనిగా నోరాడిస్తూ ఉంటారు. ఏదో ఒక చిరుతిండి తినందే వారికి తోచదు. ముంబైలోని 11 ఏళ్ల సంచిత కూడా ఈ కోవకు చెందిన బాలికే. పుట్టినప్పుడు చక్కగా, ఆరోగ్యంగా ఉన్న ఈ బాలిక కాస్తా.. జంక్ ఫుడ్ తెగ తినేస్తూ.. వంటికి ఏ మాత్రం శ్రమ లేకుండా గడిపేస్తోంది. దీంతో 11ఏళ్లు వచ్చే సరికి శరీరం బరువు 98 కేజీలకు చేరుకుంది. పెళ్లై 12 ఏళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో సంచితను అమ్మా నాన్న గారాబం చేసి, ఆమె అడగ్గానే ఖరీదైన ఆహార పదార్థాలను కొనిచ్చారు. దీనివల్ల బరువు విపరీతంగా పెరిగింది. దీంతో సంచితకు బేరియాట్రిక్ సర్జరీ ( బరువు తగ్గడానికి) చేయించారు తల్లిదండ్రులు. క్రిటికేర్ ఆస్పత్రిలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే సర్జరీ జరిగింది. పొట్టలోంచి కొంత భాగాన్ని తొలగించారు. ముంబైలో ఈ చికిత్స చేయించుకున్న అతిచిన్న వయస్కురాలు సంచితే. దేశంలో ఏటా 10,000 బేరియాట్రిక్ సర్జరీలు జరుగుతున్నాయి. వీటిలో చిన్నారులకు జరిగేవి 2 నుంచి 4 శాతమే ఉంటున్నాయి.